రిమ్స్ లో అత్యవసర మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. రిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు, నూతన ప్రతిపాదనలు, మౌలిక వసతుల కల్పనపై ఆయన శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రిమ్స్ ఆసుపత్రిలో చేపట్టాల్సిన అత్యవసర రిపేర్లు, తలుపులు, కిటికీలు, టాయిలెట్లు, ఆక్సిజన్ పైప్లైన్లు, జనరేటర్లు, లిఫ్ట్, రోడ్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులన్నీ ఎలాంటి జాప్యం లేకుండా అత్యవసర ప్రాతిపదికన వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన రూ.11.10 కోట్ల అత్యవసర నిధులతో విద్యుద్దీకరణ, రోడ్లు, భవన సముదాయాలు, మౌలిక వసతులు, శానిటేషన్ పనులకు సంబంధించిన మరమ్మతు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని, చేపట్టిన ప్రతి పనులోనూ ఖచ్చితంగా వారంటీ, ఏఎంసీ ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. క్రిటికల్ కేర్ బ్లాక్ పనులను కేవలం 15 రోజుల్లో పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, టెండర్ల విషయంలో జాప్యం జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. అవుట్‌పేషెంట్, ప్రెగ్నెంట్ బ్లాక్ మధ్య రోగుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పనుల కేటాయింపులో ఎలాంటి సిఫార్సులు, పక్షపాత ధోరణులు ఉండకూడదని, ప్రతి పనిలోనూ పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులను హెచ్చరించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీపీఓ రమేష్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, పంచాయతీ రాజ్ ఈఈ శివరామ్, తదితర ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
