ఆదివాసీల సాంప్రదాయ ఆహార అలవాట్లు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులే సమాజ ఆరోగ్యానికి నిజమైన రక్ష అని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. బుధవారం సిరికొండ మండలం నారాయణపూర్‌లో ఆర్‌పీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ ఆహార వైభవం’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివాసీల సాంప్రదాయ ఆహార అలవాట్లు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులే సమాజ ఆరోగ్యానికి నిజమైన రక్ష అని, నేటి ఆధునిక జీవనశైలిలో తలెత్తుతున్న పలు అనారోగ్య సమస్యలను అధిగమించాలంటే మళ్లీ సంప్రదాయ ఆహార విధానాల వైపు మళ్లక తప్పదని అన్నారు. మన పూర్వీకులు అందించిన సహజసిద్ధమైన ఆహార ధాన్యాలు, చిరుధాన్యాల వినియోగంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. సుస్థిర భవిష్యత్తు కోసం పర్యావరణహిత సేంద్రీయ సాగును, మిల్లెట్ల ఉత్పత్తిని పెద్దఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీల విలక్షణ జీవన సంస్కృతిని, బలవర్ధక ఆహారాన్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తూ, గిరిజనుల ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేస్తున్న ఆర్‌పీజీ ఫౌండేషన్ బృందాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ ఫెస్టివల్’ స్టాల్ లను కలెక్టర్ సందర్శించి, స్థానిక చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలతో రూపొందించిన పోషకాలతో కూడిన వంటకాల వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసి, మొక్కను నాటి నీరు పోశారు.ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, ఉద్యానవన శాఖ అధికారి సందీప్ కుమార్, ఆర్‌పీజీ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీకర్‌రెడ్డి, తెలంగాణ ప్రోగ్రామ్ అధికారి జి.రవికుమార్, స్థానిక సర్పంచ్ విమలాబాయి, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పరిసర గ్రామాల రైతులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
