editor naresh kumar 9848025451
రెండేళ్లుగా నిలిచిపోయిన ప్రక్రియ.. ఏడాదిగా ఆర్థిక శాఖలోనే ఫైల్
50 వేల మంది నర్సింగ్ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర ఇబ్బందులు
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో నర్సింగ్ విద్యను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నర్సింగ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నర్సింగ్ కోర్సులకు సంబంధించిన ఫీజుల ఫిక్సేషన్ ప్రక్రియ రెండేళ్లుగా పూర్తికాకపోవడం, సంబంధిత జీవోకు తుది ఆమోదం లభించకపోవడంతో వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇటీవల సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్య, వైద్యరంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. విద్యపై చేసే వ్యయాన్ని కేవలం ఖర్చుగా కాకుండా భవిష్యత్తుకు పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు మెరుగైన విద్యతో పాటు విద్యార్థులకు నైపుణ్యాలు అందిస్తే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలరని చెప్పారు. ముఖ్యంగా నర్సింగ్ విద్యార్థులకు విదేశాల్లో విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, విదేశీ భాషలను నేర్చుకుంటే మంచి వేతనాలు పొందే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు.అయితే ఈ ప్రకటనలకు భిన్నంగా నర్సింగ్ విద్యార్థుల ఫీజుల సమస్య పరిష్కారం కాకపోవడంపై విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మూడు సంవత్సరాలకు ఒకసారి ఫీజుల నిర్ధారణ
తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీజీఏఎఫ్ఆర్సీ) నర్సింగ్ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల ఫీజులను నిర్ణయిస్తుంది. సాధారణంగా మూడు సంవత్సరాలకు ఒకసారి ఫీజులను సమీక్షించి, కొత్త ఫీజులను సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాతే సంబంధిత ఫీజుల వివరాలు అధికారికంగా అమల్లోకి వస్తాయి.2023–26 కాలానికి సంబంధించి మొత్తం 13 కోర్సులకు ఫీజులను టీజీఏఎఫ్ఆర్సీ నిర్ణయించి ప్రభుత్వానికి సిఫారసులు పంపినట్లు సమాచారం. ఈ సిఫారసుల ఆధారంగా 2024 జూలై 20న ప్రభుత్వం జీవో 34ను విడుదల చేసింది. అయితే ఆ తర్వాత నర్సింగ్ ఫీజుల ఫిక్సేషన్‌కు సంబంధించిన తదుపరి ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో విద్యార్థులకు సమస్యలు కొనసాగుతున్నాయి.
ఆర్థిక శాఖలో ఏడాదిగా పెండింగ్?
నర్సింగ్ ఫీజుల ఫిక్సేషన్‌కు సంబంధించిన ఫైల్ సుమారు ఏడాది కాలంగా ఆర్థిక శాఖలోనే పెండింగ్‌లో ఉన్నట్లు కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వెలువడకపోవడంతో ఫీజు వివరాలు అధికారిక వెబ్సైట్లలో నమోదు కాకుండా నిలిచిపోయాయని పేర్కొంటున్నాయి.ఫీజు ఫిక్సేషన్ పూర్తయితేనే సంబంధిత అధికారిక పోర్టల్‌లో కొత్త ఫీజుల వివరాలు అందుబాటులోకి వస్తాయని, ఆ తర్వాతే ఆయా శాఖలకు నిధులు విడుదలై విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు జరిగే అవకాశం ఉంటుందని యాజమాన్యాలు వివరిస్తున్నాయి.
వెబ్సైట్లో ‘నిల్’.. విద్యార్థులకు నిరాశ
ప్రస్తుతం ఫీజు వివరాల కాలమ్‌లో ‘నిల్’గా కనిపిస్తుండటంతో రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ ప్రక్రియ ముందుకు సాగడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దీంతో కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని చెబుతున్నారు.రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన సుమారు 50 వేల మంది నర్సింగ్ విద్యార్థులు ఈ సమస్య ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారని విద్యార్థి సంఘాలు, కళాశాలల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
బకాయిలు రూ.500 కోట్ల వరకు ఉన్నాయా?
నర్సింగ్ విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోయాయని, అవి సుమారు రూ.500 కోట్ల వరకు ఉండవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మొత్తంపై ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడటమే కాకుండా, కళాశాలల నిర్వహణపై కూడా ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్న కళాశాలలు తమ నిర్వహణ ఖర్చులను సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటున్నాయి.
ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు
సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారులను పలుమార్లు కలిసినా స్పష్టమైన నిర్ణయం రాలేదని పలు నర్సింగ్ కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎంను కూడా పలుమార్లు కలిసి సమస్యను వివరించినప్పటికీ పరిష్కారం లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఫీజుల ఫిక్సేషన్ ఫైల్ ఎక్కడ నిలిచిపోయింది? దానికి ఆమోదం ఎందుకు ఆలస్యమవుతోంది? విద్యార్థుల ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో ఇంతకాలం జాప్యం ఎందుకు జరుగుతోంది? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
మాటల్లో ప్రాధాన్యం.. చేతల్లో ఆలస్యం ఎందుకు?
నర్సింగ్ విద్యకు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఆరోగ్య రంగంలో నర్సుల కొరత, అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో నర్సింగ్ విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందిస్తే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.అలాంటి కీలకమైన రంగంలో విద్యార్థులకు ప్రభుత్వం అందించాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందకపోవడం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఒకవైపు నర్సింగ్ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూ, మరోవైపు ఫీజుల ఫిక్సేషన్ వంటి కీలక నిర్ణయాల్లో జాప్యం చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
నర్సింగ్ ఫీజుల ఫిక్సేషన్‌కు సంబంధించిన ఫైల్‌ను ప్రభుత్వం వెంటనే పరిశీలించి తుది ఆమోదం ఇవ్వాలని విద్యార్థి సంఘాలు, నర్సింగ్ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా త్వరితగతిన విడుదల చేయాలని కోరుతున్నాయి.నర్సింగ్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. ఫీజుల ఫిక్సేషన్‌పై ప్రభుత్వం ఎప్పుడు తుది నిర్ణయం తీసుకుంటుందో, పెండింగ్ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తుందో స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.
