Home తెలంగాణ రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఆరోగ్యకరమైన జీవనం కూడా కీలకం

రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఆరోగ్యకరమైన జీవనం కూడా కీలకం

0

మనిషి ఆరోగ్యంగా ఉంటేనే సుఖసంపదలు

 

ప్రొద్దుటూరులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు – అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా), నవంబర్ 26 (ఆరోగ్యజ్యోతి):

మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయని, ఆరోగ్యమే నిజమైన సంపద అని అంబేద్కర్ సేన రాష్ట్ర కన్వీనర్ దప్పెల్ల దేవదాసు అన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవన హక్కును కల్పించిందని, ఆ హక్కులో ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన పరిస్థితులు కూడా అంతర్భాగమని పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు పట్టణంలో అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైదుకూరు రోడ్డులోని పాండురంగ స్వామి ఆలయం సమీపంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దప్పెల్ల దేవదాసు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, వాటిని పరిరక్షించుకోవడంతో పాటు రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక బాధ్యతలను కూడా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

ఆరోగ్యం అనేది కేవలం అనారోగ్యానికి చికిత్స పొందటమే కాదని, ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం, పరిశుభ్రమైన పర్యావరణం, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని అన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందినప్పుడే సమానత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పేదలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, అణగారిన వర్గాలకు ప్రభుత్వ వైద్య సేవలు మరింత చేరువ కావాలని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.బి. సాగర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ ఉందని వివరించారు. సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ద్వారా జీవించే హక్కులో ఆరోగ్య పరిరక్షణ, అత్యవసర వైద్య సహాయం వంటి అంశాల ప్రాధాన్యతను గుర్తించిందని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రజల పోషకాహార స్థాయి, జీవన ప్రమాణాలు, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతల్లో ఒకటిగా పేర్కొంటుందని వివరించారు.

అలాగే ఆర్టికల్ 14 సమానత్వ హక్కును, ఆర్టికల్ 15 వివక్షకు వ్యతిరేకంగా రక్షణను కల్పిస్తాయని, ఆర్టికల్ 38 సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఆర్టికల్ 39(ఇ), 39(ఎఫ్) కార్మికుల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి, వారి గౌరవప్రదమైన జీవనానికి ప్రాధాన్యత ఇస్తాయని వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ఏ పర్యావరణ పరిరక్షణను, ఆర్టికల్ 51ఏ(జి) ప్రకృతిని, అడవులను, నదులను, వన్యప్రాణులను కాపాడటం పౌరుల బాధ్యతగా నిర్దేశించాయని తెలిపారు.

ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేలా కృషి చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయడం ఎంతో అవసరమని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలైన సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేన రాష్ట్ర కన్వీనర్ దప్పెల్ల దేవదాసు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.బి. సాగర్, ఎం. ప్రశాంత్ కుమార్ (విరమణ పొందిన కెనరా బ్యాంకు ఉద్యోగి), ఎం. అరుణ్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version