Home Uncategorized రిమ్స్ జనరల్ ఆసుపత్రిని పరిశీలించిన డైరెక్టర్ డాక్టర్ బలరాం చిట్కే

రిమ్స్ జనరల్ ఆసుపత్రిని పరిశీలించిన డైరెక్టర్ డాక్టర్ బలరాం చిట్కే

0

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు – సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు

అదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బలరాం చిట్కే తొలిసారిగా రిమ్స్ జనరల్ ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన వెంట రిమ్స్ ఆర్‌ఎంఓ డాక్టర్ విజయ సారథి ఉన్నారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగం నుంచి వివిధ వార్డుల వరకు పరిశీలించిన డైరెక్టర్ రోగులకు అందుతున్న వైద్య సేవలు, పరిశుభ్రత, సిబ్బంది విధుల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు. నర్సింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు రోగుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలతో పాటు వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ల్యాబొరేటరీలో అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలని, పరీక్షల నివేదికలు కచ్చితత్వంతో ఉండాలని స్పష్టం చేశారు. వైద్యులు నిర్ణీత సమయానికి విధులకు హాజరై రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డైరెక్టర్ డాక్టర్ బలరాం చిట్కే సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version