Editor -Naresh Kumar 9848025451
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆరోగ్య జ్యోతి): హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో చిన్నారులకు పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొ. రాహుల్ దేవరాజ్ తెలిపారు. నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ ప్రొ. అమరేశ్వర్ నేతృత్వంలో శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. లండన్‌కు చెందిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా. రమణ తన్నషునేని, సాంకేతిక నిపుణుల బృందం సహకారం అందించనుంది. గత ఐదేళ్లుగా ప్రతి సంవత్సరం నిమ్స్‌లో ఈ ఉచిత గుండె శస్త్రచికిత్స కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. ఈసారి అవసరాన్ని బట్టి ప్రాధాన్యత కేటాయిస్తూ వాక్-ఇన్ విధానంలో చిన్నారులను పరిశీలిస్తారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స అవసరమున్న అర్హులైన చిన్నారులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. తల్లిదండ్రులు ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండానే సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు నిమ్స్‌లోని సీటీ సర్జరీ కార్యాలయం, మొదటి అంతస్తు, పాత బ్లాక్, పంజాగుట్టకు నేరుగా వెళ్లి సంప్రదించవచ్చు. గతంలో చేయించిన వైద్య పరీక్షలు, పాత వైద్య నివేదికలు అందుబాటులో ఉంటే వెంట తీసుకెళ్లాలి. మరిన్ని వివరాలకు 040-2348-9025 నంబర్‌లో సంప్రదించవచ్చు.
