More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    HomeHomeమసాలాల పేరుతో విషం..!

    మసాలాల పేరుతో విషం..!

    హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న భారీ కల్తీ మసాలా ముఠాను హైదరాబాద్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఛేదించారు. కాటేదాన్, బాలాపూర్, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లో నిర్వహించిన మెరుపు దాడుల్లో నాసిరకం మసాలా దినుసులకు హానికర రసాయనాలు, పారిశ్రామిక రంగులు కలిపి ప్రముఖ బ్రాండ్ల పేర్లతో మార్కెట్లో విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొత్తం 25 టన్నుల కల్తీ మసాలాలు, 89 టన్నులకుపైగా ముడిసరుకు స్వాధీనం చేసుకోగా, ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
    ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ముప్పు
    హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని తక్కువ ధరలకు కల్తీ మసాలాలను సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. లవంగాలు, ఆవాలు, జీలకర్ర, వాము, షాజీరా, మెంతులు, సోంపు, నువ్వులు వంటి దినుసులకు సింథటిక్ రంగులు, ఫ్యాబ్రిక్ డైలు, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి పదార్థాలు కలిపి ఆకర్షణీయంగా మార్చి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
    క్యాన్సర్‌ నుంచి కాలేయ వ్యాధుల వరకు ప్రమాదమే
    ఈ విషపూరిత రసాయనాలు కలిసిన మసాలాలను దీర్ఘకాలంగా వినియోగించడం వల్ల కాలేయ వ్యాధులు, క్యాన్సర్, మూత్రపిండాల సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, అల్సర్లు, అలర్జీలు, చర్మవ్యాధులు, నరాల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారిపై హత్యాయత్నానికి సమానమైన తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.
    13 యూనిట్లపై దాడులు
    విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST), జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా 13 ప్రాసెసింగ్ యూనిట్లపై దాడులు నిర్వహించారు. మూడు కేసులు నమోదు చేసి, కాటేదాన్‌కు చెందిన రాహుల్ బాటి, బేగంబజార్‌కు చెందిన విశాల్ పన్వార్, దులీచంద్ కచ్చవాలను అరెస్టు చేశారు.
    స్వాధీనం చేసుకున్నవి
    దాడుల్లో వేల కిలోల వాము, జీలకర్ర, ఆవాలు, షాజీరా, లవంగాలు, మెంతులు, సోంపు, నువ్వులు, జీలకర్ర పొడి, షైనింగ్ పౌడర్, సింథటిక్ ఫ్యాబ్రిక్ డైలు, రైస్ బ్రాన్ ఆయిల్‌తో పాటు మూడు రోలింగ్ మెషిన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
    రూ. కోట్ల టర్నోవర్.. రెండు తెలుగు రాష్ట్రాలకు సరఫరా
    ప్రాథమిక విచారణలో ఈ ముఠా గత కొన్నేళ్లుగా భారీ స్థాయిలో కల్తీ మసాలాల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తేలింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కోట్ల రూపాయల టర్నోవర్, లక్షలాది మంది వినియోగదారులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
    సిట్‌తో సమగ్ర దర్యాప్తు
    ఈ కేసు వెనుక మరింత పెద్ద నెట్‌వర్క్ ఉండే అవకాశం ఉందని భావించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, సరఫరా వ్యవస్థ, ఇతర రాష్ట్రాలతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
    140 రోజుల్లో 202 కేసులు
    హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ ఏర్పాటు చేసిన 140 రోజుల్లోనే 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 246 టన్నులకుపైగా కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. కల్తీ పన్నీర్, కుళ్లిన మాంసం, కల్తీ పెరుగు, నెయ్యి, పండ్లు, ఊరగాయలు, టీ పొడి తదితరాలపై కూడా భారీ ఎత్తున చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News