- వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా డా.ఎంసీఆర్ టిమ్స్
- త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
- ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి
తెలంగాణ బ్యూరో, (ఆరోగ్యజ్యోతి): ప్రారంభానికి ముందే మిగిలిన పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచనప్రజలకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్) సిద్ధంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి వెల్లడించారు.హాస్పిటల్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు, మౌలిక వసతులు, వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది, భద్రత, ఇతర సహాయక వ్యవస్థలను పరిశీలించేందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌ను సందర్శించారు. హాస్పిటల్‌లోని A, B, C బ్లాకులను మంత్రి పరిశీలించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఉద్యోగులతో మాట్లాడి సేవల నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
హాస్పిటల్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన మంత్రి, ప్రారంభానికి ముందు పూర్తి చేయాల్సిన పనులు, అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మిగిలిన అన్ని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, హాస్పిటల్‌ను పూర్తిస్థాయి సేవలకు సిద్ధం చేయాలని ఆరోగ్యశాఖ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. హాస్పిటల్ ప్రారంభమైన రోజు నుంచే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేసేలా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు.హాస్పిటల్‌లో వైద్య సేవల నిర్వహణ, మౌలిక వసతులు, మానవ వనరులు, నాన్-మెడికల్ సర్వీసులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, ఫైర్ సేఫ్టీ, ఇతర వ్యవస్థలపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.హాస్పిటల్‌లోని ప్రతి విభాగం ప్రారంభానికి ముందే పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు, వారికి అవసరమైన అన్ని సహాయక సేవలు కూడా నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హాస్పిటల్‌లో పనిచేసే డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, పరిపాలనా సిబ్బంది తదితర మానవ వనరులను అవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉంచాలని సూచించారు.డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌ను రాష్ట్రంలోని ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని మంత్రి తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలు, ఆధునిక మౌలిక వసతులు, సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు, క్రిటికల్ కేర్, అత్యవసర వైద్యం, అవయవ మార్పిడి వంటి క్లిష్టమైన వైద్య సేవలను ఒకే వేదికపై అందించేలా టిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యానికి అనుగుణంగా డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. టిమ్స్‌లో పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోని ప్రధాన ప్రభుత్వ హాస్పిటళ్లపై ఉన్న ఒత్తిడి తగ్గడంతో పాటు, సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరమైన రోగులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.“డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ప్రజలకు నాణ్యమైన, అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది. హాస్పిటల్ ప్రారంభానికి సంబంధించిన మిగిలిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా హాస్పిటల్‌ను త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. ప్రారంభం నుంచే రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నాం” అని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, ఆరోగ్యశాఖ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, టిమ్స్ వైద్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
