ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి ౼వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
హనుమకొండ లోని ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయిపోలియో మహమ్మారిని దేశం నుంచి నిర్మూలించినప్పటికీ, భవిష్యత్తులో ఆ వ్యాధి మళ్లీ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు భరోసా కల్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.
హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మూడేళ్ల కుమార్తెకు ఎంపీ స్వయంగా పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఇతర చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారిని ఎత్తుకొని పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. పోలియో మైలిటిస్ వ్యాధి చిన్నారులను జీవితాంతం అంగవైకల్యానికి గురిచేసే ప్రమాదకరమైన వ్యాధి అని పేర్కొన్నారు. భారతదేశం 2014లోనే పోలియో రహిత దేశంగా ప్రకటించబడినప్పటికీ, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని కొనసాగిస్తోందన్నారు. గతంలో పోలియో చుక్కలు వేసినా, వేయకపోయినా ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి ఈ కార్యక్రమంలో ఉచితంగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.
వరంగల్‌ను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో మౌలిక సదుపాయాలను విస్తరిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా 24 అంతస్తులతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరలో అందుబాటులోకి రానుందని వెల్లడించారు. జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకం చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు గుర్తుచేశారు. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
హనుమకొండ జిల్లాలో సిజేరియన్ ప్రసవాల సంఖ్యపై ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవాలపై గర్భిణులు, వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు. వైద్యపరంగా అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ ఆపరేషన్లు చేయాలని, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు, గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్య భద్రతకు పోలియో చుక్కలు ఎంతో కీలకం అని అన్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో నవంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన ఐదు జిల్లాల్లో హనుమకొండ జిల్లా కూడా ఉండటం సంతోషకరమని తెలిపారు. జిల్లాలో సుమారు 84 వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం 497 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని సూచించారు.ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవీ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ అప్పయ్య, అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్ మదన్ మోహన్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృష్ణరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మురళి, ట్రైసిటీస్ అపార్ట్మెంట్ అధ్యక్షులు కేశవ రెడ్డి, జీఎంహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ మంజుల, డాక్టర్ జయకృష్ణ, డాక్టర్ మానస రెడ్డి, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
