Editor K.Naresh Kumar 9848025451
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు నిరంతర వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డుల ద్వారా విజ్ఞప్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని నాయకులు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తున్నప్పటికీ, ఉద్యోగ భద్రత, వేతనాలు, సర్వీసు ప్రయోజనాలు వంటి అంశాల్లో తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, అన్ని కేడర్లకు తగిన విధంగా కేడర్ ఫిక్సేషన్ చేపట్టి వంద శాతం స్థూల వేతనం చెల్లించాలని పోస్టుకార్డుల ద్వారా ముఖ్యమంత్రిని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు ఉద్యోగులందరికీ ఉద్యోగ ఆరోగ్య పథకం, బీమా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కుటుంబాలకు దూరంగా, పని ఒత్తిడిని భరిస్తూ నిరంతరం సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఇకనైనా గుర్తించాలని నాయకులు కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి స్వయంగా స్పందించి, సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల పోరాటం ప్రజాస్వామ్యబద్ధమైనదని, ఎవరినీ ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, దశాబ్దాలుగా అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు, గౌరవం, ఉద్యోగ భద్రత సాధించుకోవడమే తమ లక్ష్యమని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు దొంతుల ప్రవీణ్, ఉపాధ్యక్షుడు వైద్యుడు ఈశ్వర్, కోశాధికారి గితేష్, వైద్యులు సుజాత, అమర్, అశ్విని, సంతోష్, సబోహి, అనితతో పాటు అశోక్, రాధ, గోపాల్, శివ, పుష్ప, రాజ్‌కుమార్, రనీత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
