Home తెలంగాణ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

0

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. యూసుఫ్‌కు వినతిపత్రం అందజేత

కరీంనగర్, సెప్టెంబర్ 8 (ఆరోగ్యజ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. గత సంవత్సరం ప్రభుత్వం పెంచిన వేతనాలను వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ఏఐటీయూసీ నాలుగో రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, కనీస వేతనాల సలహా మండలి సభ్యుడు ఎం.డి. యూసుఫ్‌కు ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. నరసింహ వినతిపత్రం అందజేశారు.ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన 1195, 1190, 1187 నంబర్ల ప్రభుత్వ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని కోరారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగులకు ఆరోగ్య బీమా, ఆరోగ్య కార్డులు, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ప్రతి నెల 5వ తేదీలోపు ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని, 2018 నుంచి 2026 వరకు 510, 730 నంబర్ల ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల వేతనాల్లో నష్టం జరిగిన అన్ని కేడర్ల ఉద్యోగులకు న్యాయం జరిగేలా కొత్త ఉత్తర్వులు జారీ చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.అలాగే సంవత్సరానికి 35 రోజుల సాధారణ సెలవులు మంజూరు చేయాలని, విధి నిర్వహణలో ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలోని ఒకరికి ఆరు నెలల్లోగా కారుణ్య నియామకం చేపట్టాలని కోరారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకంగా సేవలందిస్తున్నారని, వారి న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి దేవునబోయిన బాపు యాదవ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శాతల్లా సాగర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version