Home తెలంగాణ క్షయ నిర్మూలనలో యువత భాగస్వామ్యం కీలకం

క్షయ నిర్మూలనలో యువత భాగస్వామ్యం కీలకం

0

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు యువతను భాగస్వాములను చేయడం ఎంతో అవసరమని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి. సుమలత అన్నారు. రిమ్స్ వైద్య కళాశాలలో నిర్వహించిన “క్షయ ముక్త్ అభియాన్” కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ఎన్‌సీసీ కేడెట్లకు క్షయ వ్యాధిపై ప్రత్యేక శిక్షణ, అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ సుమలత మాట్లాడుతూ.. క్షయ వ్యాధి పూర్తిగా నయం అయ్యే వ్యాధి అయినప్పటికీ, వ్యాధి లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేయడం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, రాత్రివేళ చెమటలు పట్టడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్య కేంద్రాన్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వారు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవాలని తెలిపారు. చికిత్స మధ్యలో నిలిపివేయకుండా పూర్తిగా మందులు వాడటం ద్వారా వ్యాధి నుంచి బయటపడవచ్చన్నారు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ప్రజలు కూడా క్షయ బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారికి అండగా నిలవాలని కోరారు.ఎన్‌సీసీ కేడెట్లకు క్షయ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి, అనుమానితులను పరీక్షలకు ఎలా ప్రోత్సహించాలి, చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి సహకారం అందించాలి అనే అంశాలపై వివరంగా శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన కేడెట్లు తమ విద్యాసంస్థలతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని డాక్టర్ సుమలత సూచించారు.క్షయ రహిత సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, ముఖ్యంగా విద్యార్థులు మరియు యువత ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాలని ఆమె పేర్కొన్నారు. క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షలకు తీసుకురావడం, వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించడం, చికిత్స పూర్తయ్యే వరకు బాధితులకు సహకరించడం ద్వారా క్షయ నిర్మూలన కార్యక్రమానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version