న్యూఢిల్లీ, ఆగస్టు 7 : వరంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల, మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రితో పాటు కేంద్ర సహకారంతో నడిచే ప్రభుత్వ వైద్య సంస్థల్లో నెలకొన్న సిబ్బంది కొరత అంశాన్ని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రస్తావించారు. వైద్య సేవల నాణ్యతపై ప్రభావం చూపుతున్న ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎంపీ కడియం కావ్య వైద్యులు, స్పెషలిస్టులు, నర్సింగ్ అధికారులు, పారామెడికల్ సిబ్బంది కొరతపై ప్రశ్నించారు. ముఖ్యంగా వరంగల్ ప్రాంత ప్రజలకు సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో వైద్య సేవలపై ఒత్తిడి పెరుగుతోందని వివరించారు.
ఎంజీఎం ఆసుపత్రి తెలంగాణలో కీలక వైద్య కేంద్రంగా కొనసాగుతోందని, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి రోగులు ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తగిన సంఖ్యలో నిపుణ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది లేకపోవడం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న వైద్య సంస్థల్లో కూడా సిబ్బంది కొరత కొనసాగుతుండటం ఆందోళనకరమని ఎంపీ తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు, వాటి భర్తీకి కేంద్రం చేపడుతున్న చర్యలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరారు.
వైద్య రంగంలో మౌలిక వసతుల విస్తరణతో పాటు తగిన మానవ వనరులు అందుబాటులో ఉండటం అత్యంత అవసరమని కడియం కావ్య అభిప్రాయపడ్డారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ఖాళీలను అత్యవసరంగా భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు. వైద్య సంస్థల్లో సిబ్బంది కొరతను నివారించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.
