సైబర్ నేరాల పట్ల అప్రమత్తత తో వ్యవహరించాలి.
బీఎస్ఎఫ్ జవాన్లమంటూ నమ్మించి డయాగ్నోస్టిక్ సెంటర్ ల్యాబ్ టెక్నీషియన్‌కు సైబర్ మోసం.
ఫోన్‌పే ద్వారా విడతలవారీగా రూ.73,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు.
వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్.
ఆదిలాబాద్ కలెక్టర్ చౌక్‌లోని సెల్ఫ్ చెక్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తికి గుర్తుతెలియని సైబర్ నేరగాడు బీఎస్ఎఫ్ జవానుగా పరిచయం చేసుకొని మోసానికి పాల్పడ్డాడు.
ఈ నెల 25వ తేదీన 27 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు రక్త పరీక్షలు చేయించాల్సి ఉందని, పరీక్షల చార్జీల గురించి ఫోన్ ద్వారా సంప్రదించాడు. ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున చెల్లిస్తామని నమ్మించి, ముందస్తుగా 50 శాతం చెల్లిస్తామని చెప్పి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఫోన్‌పేలో వివిధ లావాదేవీలు చేయించాడు.
ఈ క్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ ఫోన్‌పే ఖాతా నుంచి పలుమార్లు మొత్తం రూ.53,000, డయాగ్నోస్టిక్ సెంటర్ యజమాని ఫోన్‌పే ఖాతా నుంచి రూ.20,000 కలిపి మొత్తం రూ.73,000 బదిలీ చేయించి మోసానికి పాల్పడ్డాడు.
అనంతరం నిందితుడి మాటల్లో మోసాన్ని గుర్తించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేసి, సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేశాడు.
ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో FIR No. 826/2026 U/s 316(5), 318(4) BNS & 66(D) IT Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.
ప్రజలకు సూచనలు:
- గుర్తుతెలియని వ్యక్తులు బీఎస్ఎఫ్, ఆర్మీ లేదా ఇతర ప్రభుత్వ శాఖల అధికారులమని చెప్పినా పూర్తిగా నమ్మవద్దు.
- వాట్సాప్ వీడియో కాల్లో ఇతరులు చెప్పినట్లు ఫోన్‌పే లేదా ఇతర UPI యాప్‌లలో లావాదేవీలు చేయవద్దు.
- డబ్బులు స్వీకరించడానికి UPI PIN నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. PIN నమోదు చేస్తే మీ ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అవుతాయి.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతతోనే వాటిని అడ్డుకోగలం. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైనట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని 1వ పట్టణ ఎస్హెచ్ఓ బి. సునీల్ కుమార్ ప్రజలకు సూచించారు.
