సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. 11వ రోజు సమ్మెకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 23 (ఆరోగ్యజ్యోతి):*నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూకల అంజి యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగుల నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ఏఐటీయూసీ సంపూర్ణ సంఘీభావం తెలిపింది.శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట యాదాద్రి జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఇమ్రాన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రామ రాజేష్ ఖన్నా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సుమారు 20 ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తక్కువ వేతనాలతో పనిచేయడం బాధాకరమన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు చెల్లించాలని, ఉద్యోగులపై డ్యూటీ చార్ట్‌కు మించి అదనపు పనిభారం మోపడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఎంపికైన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారి పక్షాన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ఏడు రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ రెగ్యులరైజేషన్ చేయాలి
ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూకల అంజి యాదవ్ మాట్లాడుతూ, ఇతర ఏడు రాష్ట్రాల్లో ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జరిగినట్లుగా తెలంగాణలోనూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ ఎలాంటి షరతులు లేకుండా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటాకు సంబంధించి ఉద్యోగులకు వేతన ప్రయోజనాలు కల్పించడంలో జాప్యం జరుగుతోందని విమర్శించారు. ఉద్యోగులకు న్యాయమైన వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
యాదాద్రి జిల్లా నూతన కమిటీ ఎన్నిక
సమావేశంలో రామ రాజేష్ ఖన్నా నేతృత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్‌హెచ్‌ఎం అన్ని క్యాడర్ల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఎం.డి. ఇమ్రాన్, అధ్యక్షుడిగా డాక్టర్ షాహిద్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బానోత్ నెహ్రూ నాయక్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ మురళీమోహన్, డాక్టర్ హరీష్, డాక్టర్ గిరిజా, ప్రధాన కార్యదర్శిగా జోగు అనూష, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ మాల్యాంక, కోశాధికారిగా శ్రీదేవి, మధు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా జోష్ణ, అన్నపూర్ణ, రమా, చైతన్యలను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శోభన్ బాబు, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగి నరసింహతో పాటు వివిధ కేడర్లకు చెందిన సుమారు 106 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు.
